30, డిసెంబర్ 2020, బుధవారం

అక్షరాలా అక్షర మోసమిది.!

అక్షరాలా అక్షర మోసమిది.!


నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేది

స్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది


మరిచావా మానవుడా అడగడం లోతెంతని

నువ్వు మునగ దలిచిన మడుగు లోతెంతని


కలం చల్లినదంతా పవిత్రమని మునిగావో

చిమ్మ చీకటిలోనే చివరి వరుకు కూరుకుపోతు 


రుజువు లేని రాతలేరా చరితంతా

ఎవడి కంట పడిన రీతిగా

ఎవడి చెవులు విన్న రీతిగా

వాడి కలం కక్కినది.


నిజమెంత? 

కానిదెంత ?


ఒకటే కథని

అది కాదని, ఇది కాదని

పది మంది పది విధములు.


తర్జుమా ఇది అని

నిను తీసి నను పెట్టె 

నను తీసి నిను పెట్టె

ఇట్టే కథలన్నీ కథలాయే

నిజమైన నిజమెవ్వరు ఎరుకరా..


గతమేదైనా,

నువ్వు నమ్మేది

నేటిని గాయపరచనియ్యకు.

రేపటికి అడ్డమవ్వనివ్వకు.


నీకు తెలిసిన నిజం 

నువ్వు మాత్రమే..


సురేష్ సారిక

20, డిసెంబర్ 2020, ఆదివారం

బండ రాళ్ళకి ఎట్టానో పట్టదు - by Suresh Sarika

కన్నీటికేమి పుట్టిందో

ఉన్నట్టుండి ఇడిసి పెట్టింది

ఇన్నాండ్లు తోడుండి అలిసిందో

లేదా, జారీ జారీ విసిగి వేసారిందో


గుక్కపెడుతున్నా

చుక్క జాడ లేదు


బిగపట్టి కక్కుతున్నా

తేమ తగలనే లేదు


బండ రాళ్ళకి ఎట్టానో పట్టదు

ఇక ఈ గుండె మంట చల్లారెదెట్టానో


సురేష్ సారిక

11, నవంబర్ 2020, బుధవారం

దోచుకునేందుకు అనుమతి పొందేదిక్కడే - Telugu Poetry by Suresh Sarika

బాగుంది, 

సరదాగా ఆట పట్టించుకుంటున్న 

బావ, మరుదుల సమావేశాల సభ

కొసరు లాగా తోటికోడళ్ల వేళాకోలాలు

image source: google

శీతాకాల వేల పొలి కేకలు 

వినసొంపుగ పలు మాధ్యమాల్లో ప్రదర్శనలు

కని, విని తరించి పోతున్న ప్రేక్షకమయులు


దెప్పి పొడుపులిక్కడే

అరుపుల పోటీలిక్కడే

వీరంగమాడేది ఇక్కడే

సేవ చేసి అలిసామని నిద్రలిక్కడే


దోచుకునేందుకు అనుమతి పొందేదిక్కడే

దోచుకున్నది దాచుకునేందుకు చట్టాలిక్కడే


ఉత్తుత్తి మాటల పలికే కోట

ఉత్తమోత్తములు నెలకొన్న కోట


సురేష్ సారిక

6, నవంబర్ 2020, శుక్రవారం

నేనెరుగని అందమిది - Telugu Poetry by Suresh Sarika

 నేనెరుగని అందమిది

ఏ ఊహకూ అందనిది.


ఓ కవి హృదయం ఆశపడుతుంది 

ఈ అందాన్ని వర్ణించేందుకు

ఓ కలం ఆరాటపడుతుంది 

ఈ అందాన్ని పలికేందుకు


ఆ శిల్పి కుంచె ఎంతగా తపించనో 

ఈ అద్భుతాన్ని సృష్టించేందుకు


ఎన్ని యుగాల యుగాలు పట్టెనో

ఇంతలా నిన్ను తీర్చి దిద్దేందుకు


నింగినేలల నడుమ ఏ ఒప్పందమైనదో

నిన్ను దివి నుండి భూవికి జార విడిచేందుకు


ఇన్ని కన్నులు ఎన్ని పుణ్యాలు చేసనో

నిన్ను దర్శించే వరం పొందినందుకు


నేనెరుగని అందమిది

ఏ ఊహకూ అందనిది.

సురేష్ సారిక

31, అక్టోబర్ 2020, శనివారం

నీతులు వినే ఓపిక లేదాడికి - Telugu Poetry by Suresh Sarika

 నీతులు వినే ఓపిక లేదాడికి

పాటించే ఓపిక అస్సలు లేదు.


చొంగ కార్చుకుంటూ తిరుగుతుంటాడు

ఎక్కడెక్కడ పైట కొంగు జారుతుందా అని


మత్తెక్కించే చుక్క కోసం చక్కర్లు కొడతాడు

పొగల మైకపు అంచుల్లో నిత్యం తూలుతుంటాడు


తిని తొంగోవడమే బాధ్యతంటాడు

వాడ్ని వాడు మోసుకోవడమే భారమంటాడు


వాడి మాటకి అదుపు లేదు

నొప్పించి మాటలే తుమ్ముతుంటాడు


దోచుకుంటాడు...దాచుకుంటాడు

బలహీనుడినే వాడు వేటాడతాడు


అదే వాడి తత్వమంటాడు.

మనిషి మాత్రం కాడు వాడు.


సురేష్ సారిక27, అక్టోబర్ 2020, మంగళవారం

నా కన్ను ఏమి చెయ్యలేక రెప్పలు కప్పుకుంటుంది - సురేష్ సారిక

 నా కన్ను చూస్తుంది.

రెక్కలాడించి ఆడించి 

డొక్కలెండిన పేదవాడిని

బక్క పీనుగై పడి బాటపై 

తిరుగాడుతున్న వాడిని


నా కన్ను చూస్తుంది.

పోరాడే ఓపిక లేనోడిని పీక్కుతింటున్న వాడిని

తిని బలిసి తిన్నదరిగే వరకు తింటున్న వాడిని

అది చూసి పట్టలేక మొరుగుతున్న వాడిని

చూసి చూడక పక్కకు జరుగుతున్న వాడిని


నా కన్ను చూస్తుంది.

తప్పు చేసి తప్పించుకునే వాడిని

తను చేసిందేది తప్పు కాదను వాడిని


నా కన్ను చూస్తుంది.

చూసి తడుస్తుంది.

ఏమి చెయ్యలేక

రెప్పలు కప్పుకుంటుంది.


సురేష్ సారిక

7, అక్టోబర్ 2020, బుధవారం

కంటికంటిందో నెత్తుటి చుక్క


గుండె పగిలి ముక్కలవ్వగా
కంటికంటిందో నెత్తుటి చుక్క

గరగరలు రేపుతూ కన్నీటిని
బయటికి తోడుతుంది

చిప్పల రెప్పలాట
చిటపటల మంట రేపుతోంది

పోటుని పట్టలేక
ఎప్పటికీ మూసుంచమంటుంది

వెలుగుని చూడలేక
చీకటిలో ఎదురు చూస్తుంది

మాపటేలకు కునుకు పైబడితే
కూసంత కుదుటపడుతుంది.

సురేష్ సారిక


30, సెప్టెంబర్ 2020, బుధవారం

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడు

పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడు 

బాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు


నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడిని

నిన్ను అదిమేందుకు నువ్వే జీతమిస్తున్నావింకొకడికి


ప్రజాస్వామ్య రాజ్యమంటూ రాచరిక పాలనలో మగ్గుతున్నావు

ప్రశ్నించడం మాని తలవంచుకు తిరుగుతున్నావు


సర్దుకుపోతూ బానిసవయ్యావు

నీ బిడ్డకి అదే అలవరుస్తున్నావు


విమర్శించక నాలుక ముడి వేసుకున్నావు

ఎదురు తిరగక బందీగా పడి వున్నావు


నువ్వు ప్రశ్నించనంత కాలం

నువ్వు విమర్శించనంత కాలం

ఈ దరిద్ర రాజకీయం మారదు

ఏ ఉద్యోగికి బాద్యత గుర్తు రాదు


అధికారం ప్రజల మీద కాదు 

పనుల మీద అని గుర్తు చెయ్యి


దోచుకోవడమే లక్షణమైన వాడిని

నగ్నంగా ప్రపంచానికి చూపించు


స్వప్రయోజనాల కోసం

కుల, మత, వర్గ విబేధాలు రగిలించే వాడిని

ఆ మంటలలోనే తగలెట్టు


అబద్ధాని చూపిస్తున్న అద్దాలను పగల గొట్టు

నిజాన్నీ నలు దిక్కులు ప్రసరించేలా విరజిమ్ము


నువ్వు మారితే చాలదు 

ప్రతి మనిషిని మార్చు.


సురేష్ సారిక1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మనసుకీ సంకేతాలేందుకో.!

 మనసుకీ సంకేతాలేందుకో.!

అర్థంకాక తెగ ఆయాసపడుతుంది.

ఓ తీపి జ్ఞాపకం నాకందబోతుందా.!
ఈ జన్మకు సరిపడు జ్ఞాపకాలను
మిగల్చ బోతుందా.!

వడిసి పట్టుకోనా, లేక
వదులుగా పట్టి చేజార్చుకోనా.?

తెలియదు.!
తికమక పడుతూ ఆలోచనలు అడుగులేస్తున్నవి
తడబడితే ఓ పోరపాటుగా ఇది మిగిలిపోతుందని

వద్దు...
మానుగా ఎదగలేని విత్తుకి చిగురులెందుకు
క్షణం కునుకు తియ్యలేని కంటికి రెప్పలెందుకు

మనసుకి సర్ది చెప్పి
మౌనంగా పక్కకు జరిగిపో

చల్లదనం తగిలిన
మేఘంలా కరిగిపో

తెల్లవారు జామున
చందమామ వెలుగులా వెలిసిపో

సురేష్ సారిక


బిగుసుకున్నది గుండే అదే పనిగా కష్ట మెత్తి

బిగుసుకున్నది గుండే
అదే పనిగా కష్ట మెత్తి

అలిసిపోయింది ఆశ
పదే పదే చచ్చి పుట్టి

నానిపోయింది కన్ను
కన్నీట మునిగి

చెయ్యి చాచింది బ్రతుకు
ఓ గట్టి తోడుకి

సురేష్ సారిక 27, ఆగస్టు 2020, గురువారం

ఆ నింగి నీడనేగా ఈ కట్టె ఆటలన్ని

నీలాకాశంతో దూరం తగ్గిద్దామని

పిచ్చి మనసుకు సర్దిచెప్పి మరీ

బలవంతగా ఓ అడుగు ముందుకేస్తే


నువ్వు నాకో మట్టి బెడ్డవేనని

కసురుకుని ముఖం చాటేసింది


ఎన్నో అందాలు, ఆగాధాలు దాచుకున్న ఆ నింగి

నాకో అణువంత చోటు చూపించలేకపోయింది


మోకాళ్లపై వాలి అర్ధించినా కనికరం చూపనంది

బానిసనై ఉంటానని వేడినా విదుల్చుకుపోయింది


అహం చంపుకుని,  దిగజారి నిలిచినా

కనీసం అంగుళం వంగి చూడనంది


లేదు, మనసే లేదు

కాదు, మనిషే కాదు


వెర్రితనం పెరిగి కేకలేస్తున్నా

లేకపోతే ఏమి పోలికలివి


విసుగెంత చెందినా

దూరమెంత జరిగినా 


ఆ నింగి నీడనేగా

ఈ కట్టె ఆటలన్ని


తెలిసిందిగా,

కాలి బొటనేళ్ళు కట్టేదాకా

నోటిలో తులసాకు పెట్టేదాకా


మొఖంపై కాసన్ని సన్నీళ్లు సల్లుకుని 

తుడుసుకుపోరా సవట దద్దమ్మ.


సురేష్ సారిక

telugu poetry


 


13, ఆగస్టు 2020, గురువారం

తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగా సరితూగునా నీ తళుకుకి.

తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగా 

సరితూగునా నీ తళుకుకి


మంచు కొండలన్ని అలిగి మరుగున పడవా

నీ చల్లని చూపుకి


నవ్వుతూ వికసించిన నీ మోము చూసి

పువ్వులన్నీ నీ వంత పాడవా


నిసిరాతిరి, కడలి అలలు హొయలన్నీ

నీ నడకను చూసి నేర్చినవెనేమో


మారు మాట లేకుండా చెబుతున్న వినుకో

దిగదుడిపేగా అండ బ్రహ్మాండ వింతలన్ని 

నీ ముందుర


సురేష్ సారిక


11, ఆగస్టు 2020, మంగళవారం

ఉన్నట్టుండి పడక నుండి తుళ్ళి పడి లేచింది ప్రాణం.

ఉన్నట్టుండి పడక నుండి తుళ్ళి పడి లేచింది ప్రాణం.
అటు ఇటు చూసి ఏమయ్యిందని తనని తాను తడుముకుంది.
వెను తిరిగి తన పడక చూసి కాలమయ్యిందని తెలుసుకుంది

తనకిసిరిన మెతుకులు పూర్తయ్యాయనుకుంది
ఊపిరి ఆడే ఊగులాటల తాడు తెగిందనుకుంది
భూమిని కొలిచే పని ఈ నాటితో పూర్తైందనుకుంది

సంతృప్తిగా చిరునవ్వుతో చీకటిలో కలిసిపోయింది.

సురేష్ సారిక


6, ఆగస్టు 2020, గురువారం

పొద్దుగూకని రోజు

పొద్దుగూకని రోజు

మరిచా ఈ కాలాన్ని
మరిచా ఈ కాంతిని

దిగాలుగా గాలికి వేలబడి 
ఆలోచనలలో ప్రయాణిస్తున్నా

ఏదో వెతుక్కుంటూ 
లోలోతులకి జారిపోతున్నా

కనిపించే ప్రతీదీ ఓ వెంతే 
నిజంగా చూస్తున్నదే అన్నంతగా
నా ఊహలు సాగుతున్నవి

అడుగు పడ్డాకే దారి పుడుతుంది
వెనకడుగు అనే ఆలోచనే లేదు

అదుపు తప్పి పోతున్నానో, 
లేక అనుకునే కొట్టుకెళ్తున్నానో

ధారగా మొదలైన ఆలోచన ప్రవాహమైనది
అడ్డు కట్ట మరిచానేమో విచ్చలవిడిగా పోటెత్తుతున్నది.

వున్నట్టుండి పున్నమి రాత్రి  అమావాస్యగా మారినది
సీతాకోక చిలకగా మొదలై గొంగళి పురుగులా మారినది
నింగిలోని నీటి చుక్క నేల రాలె సరికి రాతి బెడ్డైనది

ఎప్పుడు దీనికి గమ్యం?
ఎక్కడ దీనికి గమ్యం?

అసంఘటనలకు ఉలుక్కుపడి నిద్ర లేచే వరకు
నెత్తిలోని తుట్టుకి పట్టిన మత్తు విడిచే వరకు
పొద్దుగూకదు ఈ రోజు. 

సురేష్ సారిక1, ఆగస్టు 2020, శనివారం

నను ఆపుతున్నదేమిటి?

అలుపు దేహానికా లేక  కనురెప్పకా
ఓటమి నాకా లేక నా ప్రయత్నానికా

ఊహాలెక్కువై బుద్ధి అలిసిందా
పరుగెక్కువై ఒళ్ళు చతికల పడిందా

అందాలు చూడలేని కన్ను చిమ్మ చీకటంటుంది
ముందడుగు వెయ్యలేని కాలు దారి లేదంటుంది

ఎందుకీ సందిగ్ధం 
నను ఆపుతున్నదేమిటి?
నాలో పేరుకుపోతున్న కోరికలా
ఒక్కసారిగా వచ్చిపడే వందల ఆలోచనలా
నిజమనే అబద్ధాని తెలుసుకోవాలనే తపనా, లేక 
అనంతానికి నాకు మద్య జరుగుతున్న సంఘర్షణా
ఏమో..
ఇంతా తెలిసి, 
ఇంకా ఏవో మసక పొరలు నా గమ్యంపై
కాసేపు ఆగిపోవాలని
కాసేపు వెతుకులాడాలని
కనీసం ఊపిరి ఆగే లోపు ఐనా
ఎదో ఒక ఆధారం దొరుకుతుందో లేదో  ?
సురేష్ సారిక

For More Click Here


ఎంతేసుకు పోతాడని ఇంతటి ఆరాటమీడికి..!

మనిషి, మనిషేనని పొరబడ్డా
కాడు వీడు, 
వంకరు బడ్డ సంకర జాతి కొడుకు వీడు
అడ్డగోలుగా ఎదిగిన నికృష్టపు రూపమీడు

ఎవడో ఉగ్గుపట్టి పోసినాడు రాక్షస లక్షణాలీడికి
అరిగినదే తిన్నట్టున్నాడు విచక్షణ ఇసుమంత లేదీడికి
 
ఎంతేసుకు పోతాడని ఇంతటి ఆరాటమీడికి
ఈ నీచ బతుకు తీరుపై విసుగున్నది రాదిక వీడికి

మానవ తత్వం లెనోడిని మనిషని ఎలా అనను నేను 
కనీసం జంతువు తీరుకు కూడా దరిదాపుగా లేడీడు

ఇలాంటోడి దగ్గర కుళ్ళుడు కంపే కొడుతుంది

పూడ్చాక భూదేవి కూడా భరించలేదీడ్ని

మారతాడాని వీడ్ని చూస్తూ ఉండలేను
నొప్పి తెలిసినోడిని కనుక వీడిపై చెయ్యీ లేపలేను
ఇలా, నాలో అక్కసుని పచ్చిగా కక్కడం తప్ప.

సురేష్ సారిక

For More Click Here


26, జులై 2020, ఆదివారం

ఇదే ఈ నాటి రాత.

తియ్యని ప్రేమల రుచులు 
కటినమైన వేదన గుర్తులు

అందమంటే 
జారే జలపాతాలు
వికసించే కుసుమాలు
వెన్నెల వెలుగులు
తారల మిళమిళలు

రైతుపై రవ్వంత జాలి
సైనికుడంటే త్యాగశీలి

తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమ
స్నేహితుడే దేవుడిచ్చిన వరం

రోజుకుక దినం వుందిగా
రాసేందుకు అదే నాకు ఆదర్శం

ఇదే ఈ నాటి రాత, 
ఇదే ఈ నాటి కవిత.

మొలకెత్తే విత్తు అందమే కాని
దాని పురిటి నొప్పులు నాకెక్కవు

అందమైన నీటి తీగలే కానీ
అవి పాకిన దారులు నాకెందుకు

కడలి తీరం దాటదు నా ఆలోచన
అలల అడుగు తాకదు నా ఆలోచన

వెండి బండ వెనుక ఏముందో తెలియదు
ఉప్పు నీటి గుండపు లోతు నాకు తెలియదు

పతనమైన వ్యవస్థలు నాకు కనబడవు
వ్యాపారమైన రాజకీయం నేను ఎరుగను
నియంతలైన నాయకులను నిందించను

పెంచి పోషింపబడుతున్న రాక్షసత్వం నాకు అనవసరం
సామాన్యుడి చేతే సమాజంపై 
రాళ్లు విసిరిస్తున్నోడు నాకు అనవసరం

ప్రపంచాన కాన్పును మించింది లేదు
పెంపకం ఎలా వుంటే నాకెందుకు

సుఖాలకై కన్న బిడ్డలను కడతేర్చుతున్న 
తల్లిదండ్రుల గురించి మాట్లాడను, 
ఎందుకంటే పాపం.

అవినీతి చేస్తున్న వెధవల గురించి మాట్లాడను
ఎందుకంటే భయం. 

మెప్పుకోసమే నా రాతలు
కుక్కలా దాని వెనకే నా అక్షరాలు

నా జబ్బ నేనే చరుచుకుంటా
నా కన్నా మొనగాడు లేడంటా

ఇదే ఈ నాటి రాత, 
ఇదే ఈ నాటి కవిత.

సురేష్ సారిక


20, జులై 2020, సోమవారం

నాకోసం మరో లోకం తలుపు తీసిందక్కడ

నిద్రకు వేళాయే
నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్ను
ఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది
పగలంతా తెగ పాకులాడిన కట్టె
చీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది

ఆశలు లేవిక, ఆదమరిచా తెలిసినదంతా
అలిసిన నా దేహం సెలవు కోరుకుంటుందిక
వెచ్చని మట్టి కప్పుకుని పడుకున్నా
ఇప్పుడు నన్ను కదిపేవారు లేరెవ్వరు
ఇకపై నాతో పోటీకి రారెవ్వరు
దీని కోసమేనా ఆగకుండా తీసిన నా పరుగు
దీని కోసమేనా మోయలేక మోసిన బరువు

నను మోసిన పేగు బంధపు ఋణం తీరిపోయినది
కట్టుకున్న తాడు బందం బలహీనపడి తెగిపోతున్నది
చీకటిలో నిశ్యబ్దంతో స్నేహం మొదలైనది
ఆహః ఏమీ అనుభూతి.
స్వర్గముపై లోకమిది. మోక్షానికి మించినదిది.
దీన్ని తలిచా బయపడినది.
మూర్ఖుడిని నేను, బలవంతంగా నెమ్మదించా.
నా స్వేచ్ఛకు నేనే సంకెల్ళేసుకు కూర్చున్నా…
హః హః…
ఇదీ వాడి లీలేనేమో
పరమార్థపు గుట్టు
రట్టయ్యేది చిట్ట చివరికేనేమో..
నిట్ట నిలువుగున్న ప్రతి వోడు
అడ్డం పడేదాకా అర్థం కాదేమో..
క్షణం తీరిక లేక ఆడినవాడను
ఇకపై కనులార్పకుండా చూసేవాడను
ఆడండి ఆడండి, అలిసేదాక ఆడండి
చూసి కాసంత రాక్షసానందం పొందుతా.
నాకోసం మరో లోకం తలుపు తీసిందక్కడ
మరో తల్లి కడుపు కాసుకు కూర్చుంది
పురిటి నొప్పులు కొన్ని, పుడమికి నొప్పులు కొన్ని
ధానమిచ్చి వస్తా, దయగల దరిద్రుడను నేను.
సెలవు
: సురేష్ సారిక


16, జులై 2020, గురువారం

బూడిదంటిందని నిప్పుని కడుగుతావా?

బూడిదంటిందని నిప్పుని కడుగుతావా?
పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా?

గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా?
తేనెటీగల ఎంగిలి అని తేనెను పారబోస్తావా?


వదిలి పోయిందని 
ఊపిరిపై నువ్వు అలగ లేదుగా!
వాలిపోతుందని 
కను రెప్పను తెరవకుండ ఉండలేదుగా!

మరి ఓటమి ఎదురైందని 
జీవితాన్ని ఎందుకు ఆపుతావు.

నీ అడుగులే 
నిన్ను ముందుకు నడిపేది.
నీ చేతలే 
నీ జీవితాన్ని నిర్మించేది.

ఎవడో వెక్కిరించాడని ఎక్కెక్కి ఏడవకు
పోరాడి గెలిచి వాడి నోటే జేజేలు విను

నీకు 
నిజమైన ఓటమి 
ఒడిపోయానని నువ్వు ఒప్పుకున్నప్పుడే.
నిలబడి ఆట ఆడుతున్నంత సేపు 
నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరమే..

గుండెను బిగించి, గట్టిగ ఊపిరి పీల్చి
ఆ ఒక్క అడుగు ముందుకు వేసావో
గెలుపు కూడా నీ ముందు 
తల దించుకు నిలబడుతుంది.

గుర్తు పెట్టుకో...
ప్రాణం పోతుందనిపిస్తే తప్ప నీ ప్రయత్నం ఆపకు.

@సురేష్ సారిక

15, జులై 2020, బుధవారం

పసివాడి నోట ఏది పల్కినా చిత్రంగా వింటాది ఈ ముసలి లోకం.

పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నో
బట్టను బండపై బాదుతూ తీసిన కూని రాగాలెన్నో 

పెద్దన్న

చూసినావానాడే పేడుపట్టినట్టి 
మురికట్టిన బట్ట బతుకులెన్నో
ఉతికి ఉతికి మురికి ఊడగొట్టి 
జాడిచ్చి వదిలిన బట్ట బతుకు గోసలెన్నో

ఆ నోట ఆ నాడే పల్కినావు
నిక్కమైన నీతి పాఠాలెన్నో

బరువెక్కువై తడబడు అడుగులనాపకుండా 
ఈడ్చుకుంటూ పొమ్మంటు చిత్రంగా చెబుతుంటివి.

ఓపిక లేక కళ్ళు బైర్లు కమ్మిన నాడు
భగవంతుడిపై బారమేసి
అడుగులోన అడుగేసి ముందుకెళ్ళాలంటివి
గట్టుపైనో లేక ఏటిలోనో 
నీ బతుకు ఎట్టాగొట్టా కొట్టుకుపోతాదంటివి

ఆది అంతాల నడుమ పంతాలు ఎందుకంటివి 
ప్రేమతో పది మందిని కూడబెట్టుకోమంటివి

ఆకలి తీర్చే మార్గమేదైన ధర్మం అంటివి
ఆశలకై పట్టే దారిని మెలుకువుగా పట్టమంటివి

జీవితాలను చూసి మోగినోడివి నువ్వు

ఉప్పు నీరు నీ గొంతు చేరి
గార్లపట్టిన కంఠం కఠినంగా మోగిందొ ఏమో
మా సెవులు విననంటూ ముడుసుకుపోయే.

ఆ కర్మఫలమీనాడు
వదలక వెంటాడుతుండగా
చచ్చుబడిన మెదడుకి అక్షరాలే అర్థం కాక
వెనుతిరిగి ముందడుగు వేస్తున్నాం..

నే చెప్పేందుకు ఏముంది ఈనాడు
కాగితాలు చదివి తెలుసుకున్న కధలు 
తియ్యంగా పల్కెడి గొంతు నాదయ్యే.
పసివాడి నోట ఏది పల్కినా
చిత్రంగా వింటాది ఈ ముసలి లోకం.

@సురేష్ సారిక

16, జూన్ 2020, మంగళవారం

ఎందుకీ తొందరకన్ను మూసేందుకు

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

ఎన్ని గొంతులు విన్నదీ ప్రాణము
ఎన్ని రూపాలు చూసింది నీ ప్రాణము

కొండనంటే అలలనెరుగదు
పేలుతున్న కుంపటెరుగదు

జారుతున్న మంచు రవ్వనెరగదు
నింగినంటిన జల పాతమెరుగదు

రెప్పార్పుతున్న చేపనెరుగదు
వొళ్ళు విరిచే పసి కందునెరుగదు

జూలు విదిల్చు పులిని ఎరుగదు
మొలకెత్తుతున్న చిగురునెరుగదు

విచ్చు కుంట్టున్న పువ్వు నెరగదు
కుంకుమ రంగు తార నెరుగదు

కోటి పూల తోటనెరుగదు
కోకిలమ్మ గొంతునెరగదు

పుట్టుటెరుగదు
చచ్చుటెరుగదు

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

కాల్చినా, నిన్ను పూడ్చిన
ఓ బండ రాయేరా నీ జ్ఞాపకం.

వచ్చినోడివి వచ్చావు కదా
కొన్నాళ్ళు నువ్వు ఉన్నన్నాళ్లు
కోరి ఏదొకటి, దానికై కూసంత చెమటోడ్చరా.

వదిలి పోయావో ఈనాడు
మరు జన్మంటు వుంటే
ఎక్కడొదిల్లెల్లావో అక్కడే మొదలెట్టేవురా

గర్వoగ చావరా, భయపడుతూ కాదు.
చిరునవ్వుతో కనుమూయరా, కన్నీటితో కాదు.

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

: సురేష్ సారిక

12, జూన్ 2020, శుక్రవారం

ఓ అనాధ కథ


పురిటి నొప్పులు గుర్తొచ్చి
నాపై కోపోమొచ్చిందొ ఏమో...
నా కడుపు నింపలేనని
కష్టాల కడిలి ఇదోద్దని
మోక్షం ఇవ్వబోయినదేమో....

పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా తల్లి

ఎర్రటి చీమలు మెత్తటి కండను చీలుస్తుంటే
గుక్కపెట్టి ఏడ్చా, అటుగా వచ్చినవారెవరో
దేవరు, అనాధ సరణపు అరుగుపై వదిలారు

ఆకలి తప్ప మరొకటి ఎరుగని పసివాడిని
ఏడ్చినప్పుడల్లా నీళ్ల పాలపీకే నోటికందేది

ఒక్కోసారి..
ఆకలికి ఓర్వలేక నోటికందినది నెమరు వేసేవాడిని
అక్కర ఎవరూ లేని నాడు
ఏడ్చి ఏడ్చి అలసి, సొలసి రెప్ప వాల్చే వాడిని.

పుట్టుమచ్చలల్లే...
కన్నీటి అట్టలట్టె లేత బుగ్గలపై

అభాగ్యుడను గుక్కెడు తల్లి పాలు ఎరుగను
పొద్దు ఎరుగను, ఏ పాప మెరుగను
ఇంత కష్టమెందుకు మోపినాడా దేవుడు నాపై

కష్టం మరిచి గట్టిగ నవ్వితే
తట్టుకోలేని లోకం
ఎప్పుడూ ఎడిపిస్తూనే వుండేది.

ఊహ తెలిసిన నాటికి
అమ్మ లేదని, నాన్న లేడని
నా వారు అనువారు లేరని
చెప్పుకునేందుకూ... ఎవరూ లేక
నాలో నేను కుమిలిపోయా..

అలగడం నేనెరుగను
తల్లితండ్రుల మారం నేనెరుగను

గోరు ముద్దులు నేనెరుగను
గసురుతూ కుక్కిన మెతుకులే అన్నీ

ఆడిస్తూ పోసిన లాల నేనెరుగను
చీదరిస్తూ కుమ్మరించిన చన్నీళ్లే

చెప్పుకుంటూ పోతే ఓ పురాణమిది

ఈ నాటికి
ప్రాణమొక్కటే నే పొందిన బహుమతి

నీరసించిన నా జీవితానికి
రేపటిపై ఆశే బలం.

: సురేష్ సారిక

11, మే 2020, సోమవారం

ఆకాశాన చుక్కలెట్టి ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకాశాన చుక్కలెట్టి
ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకుపచ్చని చెట్టుకి
రంగురంగుల పూలు అంటించనదెవరో

కాలానికి తాడు కట్టి
ఆపకుండా లాగుతున్నదెవరో

నిద్రలో నేనుండగా
ఊహాల లోకంలోకి నన్ను మోసుకెళ్లినదెవరో

ఎవరో ఎవరో
నే నమ్మని వారో
నేనే వారినో

తలచి తలచి తరిగిపోతుంది కాలం
తెలుసుకునేందుకేనేమో ఈ జీవితం

సురేష్ సారిక

9, మే 2020, శనివారం

రేపటితో నాకే ఒప్పదం లేదు

ఎప్పుడెప్పుడు ఈ సమాజంతో
సంబంధాలు తెంచుకుందామా
అని ఎదురు చూస్తున్నది మది.
రేపటితో నాకే ఒప్పదం లేదు
భరిస్తూ ఎదురు చూసేందుకు.
బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదు
ఆలోచనపై మోహపు ఛాయా లేదు
ఇంకెందుకు ఇంకా ఇక్కడ
కలుషిత మనుషుల మధ్య
కుళ్లు కంపును తట్టుకుంట్టూ
నచ్చని దారులలో పరుగెందుకు
నాకు నేను నచ్చ చెప్పుకుంటూ
బ్రతుకుతో బేరాలాడుతూ
అంతా బాగు బాగు అనుకుంటూ
కాలంతో కొట్టుకుపోవడమెందుకు
రోజురోజుకి పెరుగుతున్న విరక్తితో
నలుగురిలో సాధువులా సాగేదెందుకు
అన్నిటితో తెగతెంపులు చేసుకొని
నేనిక బంధు బంధ విముక్తుడినవ్వాలి.
ఓ దారి చూసుకుని
నేనిక బయలు దేరాలి
నాకు నేనే మార్గదర్శినై
లోక కళ్యాణ కార్యానికి సిద్ధమవ్వాలి.
స్వస్తి
సురేష్ సారిక

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో...

మురుగు ఆల్చిప్పలో ముత్యమట
మెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట
మచ్చడిన చందమామెంత అందమట
బురద కన్న కమలముకెందుకంత సొగసట
మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమట
గొంగళి పురుగు తోలు వదలగ సీతాకోక చిలుకట
పొగమంచు ముద్ద చల్లగాలికి చినుకై జారి పారునట
ఆకాశానికి అందమైన రంగట, అది మన కంటికి బ్రమట
మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో.
సురేష్ సారిక

6, మే 2020, బుధవారం

ఆకు తీసి ఊడ్చే వనితలు వయ్యారాలతో గానాలాడుతూ…

నింగి నుండి రాలిన నీటికి
నేలపై నెరలన్నీ నిండగా

నానిన నేలను రైతు
చదును చేసే వేళ,
నత్తలన్నీ పరుగు పరుగున
తేలే నేలపై, వాటికై హలం వెంట
కొంగల వేట నీటిపై తేలేటి అడుగులతో

విత్తనాల బుట్టను నడుంపట్టి
చల్ల సాగే రైతన్న మురిసిపోతూ

మొలకెత్తె విత్తనాలు వొత్తుగ
పచ్చని ముద్దుబంతి పువ్వుల్లె

ఆకు తీసి ఊడ్చే వనితలు
వయ్యారాలతో గానాలాడుతూ

నిలదొక్కుకున్న పైరు
పరుగు తీసే నిట్ట నిలువుగా

కొంకి పట్టే వరికి మోయలేనంతగా
బరువెక్కువై వరిగె పక్కకు గాలివాటుగా

తెలుసా గట్టు గట్టున చూడ
చోద్యంబు అన్నీ పీత బొక్కలే,
సునాయాసంగా ఒక్కొక్కటి పట్టి
పులిసెట్టి తినిపించె తల్లి కావలికి

కోతకు కేకలెట్టే పొలం, కోసి
పొనలు పొనలుగ తీసి కుప్పేసే రైతు

జల్లు జల్లున రాలే వడ్ల గింజలు
హోయ్ హోయ్ అంటూ రైతు
ఒక్కొక్క వరి కట్ట బండకేసి కొట్టంగ.

చాటేసి ఇసరంగ
చెత్తంత చెదరంగ
బస్తాలు నిండంగ
గుండంత నిండెగా రైతన్నకి
ఊరంత పండగే ఆ రాత్రికి

Suresh Sarika

Other famous Telugu writers poetry Here