10, జనవరి 2021, ఆదివారం

ఎందుకు కొడకా తొందర పాటు - Telugu Poetry by Suresh Sarika

 ఎందుకు కొడకా

తొందర పాటు.కీళ్ళేమన్నా అరిగాయా

నిలబడలేనని ఒరిగావు


గూల్లెమన్నా జారాయ

బతుకు భారమని కూలావు


చూపేమన్నా మసకబారిందా

తెరవలేనని మూసేసావు


చల్లగాలి నిన్ను ఒణికించిందా

కట్టెలపై వేడి కాచుకుంటున్నావు


ఎందుకు కొడకా

తొందర పాటు


ఏమిడిచి పోయావు నేలమ్మకి

ఏమట్టుకెళ్లావు ఆ నింగికి


ఎట్టాగ ఓదార్చేది మీ అమ్మని

నేనెట్టా నిలిచేది ముసులోడిని


మా బోసి నవ్వులు చూడక పోతివి

మమ్మెత్తి ఊరంతా ఉరేగించక పోతివి


ఎందుకు కొడకా

తొందర పాటు 


సురేష్ సారిక

సరిలేని సొగసరి - Telugu Poetry


 

ఎవరది? ఎవరది?

సరిలేని సొగసరి

అడ్డగోలు గడసరి

 

తింగర రాజ్యానికి రాకుమారి

శ్రీ వెంగలప్పకి సరి లేని జోడి


వెర్రి చేష్టల సుందరాంగి

తికమకల తీరుల తింగరాంగి


మాటలకు కోటలు నెరలిచ్చే

నవ్వులకు మబ్బులు పరుగులెట్టె


చూపులకు సూర్యడు దిక్కు మార్చే

నడకలకు భూమి అదిరి బెదిరే


వసంతాన చీదరింపు గొలిపే వేషం

చల్లగాలిలో సైతం చిటపటల రేపే తత్వం


ఎవరది? ఎవరది?

సరిలేని సొగసరి

అడ్డగోలు గడసరి


సురేష్ సారిక

2, జనవరి 2021, శనివారం

ఎన్నెన్నో అందాలు ప్రతీది కనువిందే కదా.

ఎన్నెన్నో అందాలు

ప్రతీది కనువిందే కదా.


నీకు తీరికలేక తొంగిచూడవు కానీ

నింగి, నేలల నడుమ వింతలే అన్నీ


బలవంతంగా బండను చీల్చుకుంటూ 

అందంగా విత్తనాలు మొలకెత్తుతున్నాయి


మేఘాలెందుకో గోడవపడుతూ

నేలపై పువ్వులంటి అగ్గి రవ్వల్ని విసురుతున్నాయి


గాలి, దుమ్ముని గాఢంగా పెనువేసుకుని

ఆకాశ విహారానికి తీసుకు వెళ్తుంది


ఎవరో మందలించినట్టు

అలిగి మబ్బుల తెర వెనక చేరింది జాబిల్లి


కడలి అంచున ధారలు 

ఒంపులు తిరుగుతున్నాయి


నింగి నుదుటన సూర్యుడు 

ఎర్రగా రగులుతున్నాడు


పొద్దుగూకే వేళ రంగులన్నీ 

ఒకదానికొకటి అల్లుకుంట్టున్నాయి


దారి తప్పక పక్షులన్నీ కనువిందుగా

కట్టకట్టుకు గూటికి ఎగురుతున్నాయి


పొగ మంచు చెమ్మకి

పువ్వులన్నీ విచ్చుకుని గుభాలిస్తున్నవి


చీకటైందని తోక చుక్కలు 

ప్రియుని వద్దకు పయనమయ్యాయి


ఎన్నెన్నో అందాలు

ప్రతీది కనువిందే కదా.


సురేష్ సారిక