Tuesday, 16 June 2020

ఎందుకీ తొందరకన్ను మూసేందుకు

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

ఎన్ని గొంతులు విన్నదీ ప్రాణము
ఎన్ని రూపాలు చూసింది నీ ప్రాణము

కొండనంటే అలలనెరుగదు
పేలుతున్న కుంపటెరుగదు

జారుతున్న మంచు రవ్వనెరగదు
నింగినంటిన జల పాతమెరుగదు

రెప్పార్పుతున్న చేపనెరుగదు
వొళ్ళు విరిచే పసి కందునెరుగదు

జూలు విదిల్చు పులిని ఎరుగదు
మొలకెత్తుతున్న చిగురునెరుగదు

విచ్చు కుంట్టున్న పువ్వు నెరగదు
కుంకుమ రంగు తార నెరుగదు

కోటి పూల తోటనెరుగదు
కోకిలమ్మ గొంతునెరగదు

పుట్టుటెరుగదు
చచ్చుటెరుగదు

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

కాల్చినా, నిన్ను పూడ్చిన
ఓ బండ రాయేరా నీ జ్ఞాపకం.

వచ్చినోడివి వచ్చావు కదా
కొన్నాళ్ళు నువ్వు ఉన్నన్నాళ్లు
కోరి ఏదొకటి, దానికై కూసంత చెమటోడ్చరా.

వదిలి పోయావో ఈనాడు
మరు జన్మంటు వుంటే
ఎక్కడొదిల్లెల్లావో అక్కడే మొదలెట్టేవురా

గర్వoగ చావరా, భయపడుతూ కాదు.
చిరునవ్వుతో కనుమూయరా, కన్నీటితో కాదు.

ఏమి చూసిందని నీ ప్రాణము

ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు 
ఎందుకీ తొందర
కన్ను మూసేందుకు

: సురేష్ సారిక

Friday, 12 June 2020

ఓ అనాధ కథ


పురిటి నొప్పులు గుర్తొచ్చి
నాపై కోపోమొచ్చిందొ ఏమో...
నా కడుపు నింపలేనని
కష్టాల కడిలి ఇదోద్దని
మోక్షం ఇవ్వబోయినదేమో....

పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా తల్లి

ఎర్రటి చీమలు మెత్తటి కండను చీలుస్తుంటే
గుక్కపెట్టి ఏడ్చా, అటుగా వచ్చినవారెవరో
దేవరు, అనాధ సరణపు అరుగుపై వదిలారు

ఆకలి తప్ప మరొకటి ఎరుగని పసివాడిని
ఏడ్చినప్పుడల్లా నీళ్ల పాలపీకే నోటికందేది

ఒక్కోసారి..
ఆకలికి ఓర్వలేక నోటికందినది నెమరు వేసేవాడిని
అక్కర ఎవరూ లేని నాడు
ఏడ్చి ఏడ్చి అలసి, సొలసి రెప్ప వాల్చే వాడిని.

పుట్టుమచ్చలల్లే...
కన్నీటి అట్టలట్టె లేత బుగ్గలపై

అభాగ్యుడను గుక్కెడు తల్లి పాలు ఎరుగను
పొద్దు ఎరుగను, ఏ పాప మెరుగను
ఇంత కష్టమెందుకు మోపినాడా దేవుడు నాపై

కష్టం మరిచి గట్టిగ నవ్వితే
తట్టుకోలేని లోకం
ఎప్పుడూ ఎడిపిస్తూనే వుండేది.

ఊహ తెలిసిన నాటికి
అమ్మ లేదని, నాన్న లేడని
నా వారు అనువారు లేరని
చెప్పుకునేందుకూ... ఎవరూ లేక
నాలో నేను కుమిలిపోయా..

అలగడం నేనెరుగను
తల్లితండ్రుల మారం నేనెరుగను

గోరు ముద్దులు నేనెరుగను
గసురుతూ కుక్కిన మెతుకులే అన్నీ

ఆడిస్తూ పోసిన లాల నేనెరుగను
చీదరిస్తూ కుమ్మరించిన చన్నీళ్లే

చెప్పుకుంటూ పోతే ఓ పురాణమిది

ఈ నాటికి
ప్రాణమొక్కటే నే పొందిన బహుమతి

నీరసించిన నా జీవితానికి
రేపటిపై ఆశే బలం.

: సురేష్ సారిక

Monday, 11 May 2020

ఆకాశాన చుక్కలెట్టి ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకాశాన చుక్కలెట్టి
ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకుపచ్చని చెట్టుకి
రంగురంగుల పూలు అంటించనదెవరో

కాలానికి తాడు కట్టి
ఆపకుండా లాగుతున్నదెవరో

నిద్రలో నేనుండగా
ఊహాల లోకంలోకి నన్ను మోసుకెళ్లినదెవరో

ఎవరో ఎవరో
నే నమ్మని వారో
నేనే వారినో

తలచి తలచి తరిగిపోతుంది కాలం
తెలుసుకునేందుకేనేమో ఈ జీవితం

సురేష్ సారిక

Saturday, 9 May 2020

రేపటితో నాకే ఒప్పదం లేదు

ఎప్పుడెప్పుడు ఈ సమాజంతో
సంబంధాలు తెంచుకుందామా
అని ఎదురు చూస్తున్నది మది.
రేపటితో నాకే ఒప్పదం లేదు
భరిస్తూ ఎదురు చూసేందుకు.
బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదు
ఆలోచనపై మోహపు ఛాయా లేదు
ఇంకెందుకు ఇంకా ఇక్కడ
కలుషిత మనుషుల మధ్య
కుళ్లు కంపును తట్టుకుంట్టూ
నచ్చని దారులలో పరుగెందుకు
నాకు నేను నచ్చ చెప్పుకుంటూ
బ్రతుకుతో బేరాలాడుతూ
అంతా బాగు బాగు అనుకుంటూ
కాలంతో కొట్టుకుపోవడమెందుకు
రోజురోజుకి పెరుగుతున్న విరక్తితో
నలుగురిలో సాధువులా సాగేదెందుకు
అన్నిటితో తెగతెంపులు చేసుకొని
నేనిక బంధు బంధ విముక్తుడినవ్వాలి.
ఓ దారి చూసుకుని
నేనిక బయలు దేరాలి
నాకు నేనే మార్గదర్శినై
లోక కళ్యాణ కార్యానికి సిద్ధమవ్వాలి.
స్వస్తి
సురేష్ సారిక

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో...

మురుగు ఆల్చిప్పలో ముత్యమట
మెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట
మచ్చడిన చందమామెంత అందమట
బురద కన్న కమలముకెందుకంత సొగసట
మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమట
గొంగళి పురుగు తోలు వదలగ సీతాకోక చిలుకట
పొగమంచు ముద్ద చల్లగాలికి చినుకై జారి పారునట
ఆకాశానికి అందమైన రంగట, అది మన కంటికి బ్రమట
మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో.
సురేష్ సారిక

Wednesday, 6 May 2020

ఆకు తీసి ఊడ్చే వనితలు వయ్యారాలతో గానాలాడుతూ…

నింగి నుండి రాలిన నీటికి
నేలపై నెరలన్నీ నిండగా

నానిన నేలను రైతు
చదును చేసే వేళ,
నత్తలన్నీ పరుగు పరుగున
తేలే నేలపై, వాటికై హలం వెంట
కొంగల వేట నీటిపై తేలేటి అడుగులతో

విత్తనాల బుట్టను నడుంపట్టి
చల్ల సాగే రైతన్న మురిసిపోతూ

మొలకెత్తె విత్తనాలు వొత్తుగ
పచ్చని ముద్దుబంతి పువ్వుల్లె

ఆకు తీసి ఊడ్చే వనితలు
వయ్యారాలతో గానాలాడుతూ

నిలదొక్కుకున్న పైరు
పరుగు తీసే నిట్ట నిలువుగా

కొంకి పట్టే వరికి మోయలేనంతగా
బరువెక్కువై వరిగె పక్కకు గాలివాటుగా

తెలుసా గట్టు గట్టున చూడ
చోద్యంబు అన్నీ పీత బొక్కలే,
సునాయాసంగా ఒక్కొక్కటి పట్టి
పులిసెట్టి తినిపించె తల్లి కావలికి

కోతకు కేకలెట్టే పొలం, కోసి
పొనలు పొనలుగ తీసి కుప్పేసే రైతు

జల్లు జల్లున రాలే వడ్ల గింజలు
హోయ్ హోయ్ అంటూ రైతు
ఒక్కొక్క వరి కట్ట బండకేసి కొట్టంగ.

చాటేసి ఇసరంగ
చెత్తంత చెదరంగ
బస్తాలు నిండంగ
గుండంత నిండెగా రైతన్నకి
ఊరంత పండగే ఆ రాత్రికి

Suresh Sarika

Other famous Telugu writers poetry Here

Friday, 1 May 2020

తప్పిపోయిన నిద్ర

తప్పిపోయిన నిద్రను
వెతికి తెచ్చుకునేటప్పడికి
అర్ధ రాత్రౌతున్నది.

రోజూ ఇదే తతంగమౌతుందని
తెలవారుతుండంగ కనుజారకుండా
ఆ నిద్రను నా కంటికే
గట్టిగా బిగించి కట్టుకున్నా

గంటలు గడిచే కొద్దీ
నిద్రపై యావ చచ్చి
లేచి నిలుద్దామని చూడగా
చిక్కు ముడి పడ్డట్టుంది
ఎంత గింజుకున్నా
మత్తు వదలనంటుంది

చేసింది ఓ పొరపాటని
అప్పటికి తెలిసొచ్చింది
నిద్రను కట్టాల్సింది
పడుకునే మంచం కోడుకనీ,
నా కంటికి కాదని.

: Suresh Sarika

కడుపు నిండి, కంటికి కూసంత కునుకు పడితే చాలనుకుంటున్నా

గంట గంటకి గొంతు తడుపుతూ
పూట పూటకి కడుపు నింపుతూ
ఆపితే పోతామనుకునే ఊపిరితో
అదుపు లేని గుండె దడలతో

కూసంత చల్లగాలి తగిలితే చలంటూ
గోరంత వేడెక్కువైతే ఉక్కబోతంటూ

ఉక్కిరిబిక్కిరి పడుతూ
రాత్రి పగలు పడిలేస్తూ

దేహానికి సేవలు చేస్తూ
అది కోరిందల్లా తీరుస్తూ

గతాన్ని తలిచి కన్నీరు కారుస్తూ
భవిష్యత్తుపై ఆశతో తడిని తుడుచుకుంటూ

విచ్చలవిడి ఆలోచనలను అదుపు చేసుకుంటూ
అదుపు తప్పకుండా అడుగులకి మద్దతిస్తూ

పద్ధతులంటూ పెద్దలు వేసిన పట్టాలు తప్పకుండా
బంధాలు పట్టుకొచ్చిన బాధ్యతలు తలెనెత్తుకుని
ఆశయాలను పక్కన పెట్టి అవసరాలను తీర్చుకుంటూ
కడుపు నిండి, కంటికి కూసంత కునుకు పడితే చాలనుకుంటూ
అనుక్షణం అదురుతూ బెదురుతూ అడుగులు వేస్తున్నా.

: Suresh Sarika

గత జన్మల పొరపాట్ల ప్రతిఫలము

సృష్టించినోడు
ఉప్పు నీటి సంద్రంలో ఈదులాడమని
పుట్టకతో నుదిటిపై మచ్చ పెట్టినాడో

ఏలేటోడు
చచ్చేదాకా బాధను అనుభవించమని
పగ పట్టి నాకు శాపమిచ్చినాడో

గత జన్మల పొరపాట్లకి ప్రతిఫలము ఇదో
తెలియకేసిన తప్పటడుగులు గమ్యమిదో

@సురేష్ సారిక

గాజు బ్రతుకుల చుట్టూ – గాలి బుడగలంటి కంచెలు

ఎడారి జీవితమే నీది నాది
ఏమున్నది పచ్చగా
మోడుబారిన బ్రతుకులివి

భ్రమ పడి పరిగెడుతున్నాం
ఎండమావి మాయలవి

కన్నీటి మరకలే ఎటు చూసినా
ఆర్తనాదాలే వినోదమాయనా

అల్పమైన ఆనందాలే మన గమ్యాలైనవి
బుద్ధి వైకల్యంతో బ్రతుకులు భారమైనవి

గాజు బ్రతుకుల చుట్టూ
గాలి బుడగలంటి కంచెలు

నూతి లాంటి విశ్వంలో
విహరిస్తున్న స్వేచ్చా జీవులం

రచయిత : సురేష్ సారిక

గుండెకు నిప్పంటుకున్నట్టుంది – Telugu Poetry

గుండెకు నిప్పంటుకున్నట్టుంది
కంటిలో సముద్రం పుట్టుకొచ్చింది

నాలో క్షణానికొకసారి భూకంపం
రెప్పలు దాటి ఉరుకుతుంది
అలలల్లే కన్నీటి హాలాహలం

ఏదో ప్రమాదమని తలచి
ముడుచుకుపోతుంది దేహం

అలసి, సొలసిన నాకు
నిద్రే సేద తీర్చే ఓ తోడు

రచయిత: సురేష్ సారిక

మరో ప్రయాణం – Telugu Poetry

తడిచిన కంటిని తుడుచుకుని
ఆరిన గొంతుని తడుపుకుని

బరువెక్కిన ఊపిరి భారం దింపుకుని
వేడెక్కిన గుండెను చల్లార్చుకుని

తీరం చేరిందన్న బ్రతుకుని
కాలపు అలలకందించా
మరో ప్రయాణం మొదలెట్టమని

అదుపు తప్పక అలలపై ఊయలాడేనో
లేక, తలక్రిందులై మునిగి తేలిపోయేనో

బ్రతుకు
మరో దిక్కున పొద్దు పొడిచేనో..
లేక, నడిమధ్యనే పొద్దుగూకేనో

@సురేష్ సారిక

స్వాగతించకు మహమ్మారి కరోనాని

స్వాగతించకు మహమ్మారి కరోనాని,
నీ చుట్టము కాదది

విష పురగది,
మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది

వాహనమవ్వకు దానికి,
మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి

సంక్రమణను ఆపడమే,
సోకితే విరుగుడు లేదు దానికి

@సురేష్ సారిక

పోరాడదాం రా … కొద్ది రోజులు కదలకుండా!

పోరాడదాం రా
కొద్ది రోజులు కదలకుండా

పోరాడదాం రా
మన జాతిపై కరోన మచ్చ పడకుండా

పోరాడదాం రా
సూచనలను అనుసరిస్తూ

పోరాడదాం రా
సేవకులకి సహకరిస్తూ

పోరాడదాం రా
కరోన పీడ విరగడయ్యే వరకు

@సురేష్ సారిక

నీ నికృష్టపు అత్యాశకు హద్దు ఇది

ఇదేనా మానవ జాతి అభివృద్ధి
విపత్తుని ఎదుర్ఖోలేని మేధాశక్తి
ఇన్నాళ్ల కృషి తెచ్చిచ్చిన ఆస్తి

కాగితాల కోసం చేస్తున్న పరుగులన్ని ఆగిపోయాయి
విర్రవీగిన అధిపత్యపు ఆనవాళ్ళు చెరుగుతున్నాయి
మొక్కినోడికి, మొక్కనోడికి రోజులు చెల్లుతున్నాయి

అనంత విశ్వంలో అడుగు బయట పెట్టలేని గతి నీది
ఎవరేసిన శిక్ష ఇది, నీ నికృష్టపు అత్యాశకు హద్దు ఇది
మితిమీరిన నీ ఆకలికి పస్థులనే బహుమానం ఇది

ఒరుగుతున్నాడు సూర్యుడు
ఆవహిస్తుంది చీకటి

తారతమ్యం తెలియని దేవుడు
ధర్మానికి, అధర్మానికి అదే శిక్ష వేస్తున్నాడు

మరో యుగాదగా ఈ కాలం మిగలనున్నది

మరో ప్రపంచం సరి క్రొత్తగ పుట్టనున్నది
మనిషి కాని మనిషి ఈ నేలను ఏలనున్నాడు

by : సురేష్ సారిక

Sunday, 22 March 2020

అలరించేందుకు కాదు నా రాతలు

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకు
పెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకు
గద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకు
సామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు
కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకు
చుట్టూ కట్టుకున్న సంకెళ్లను తెంచేందుకు
పోనీలే అనే తత్వాన్ని మాన్పించేదుకు
నేటి సమాజ స్థితికి అద్దం పట్టేందుకు
చీకటి అకృత్యాలను బట్ట బయలు చేసేందుకు
నిర్బంధించిన నిజానికి విముక్తి కలిగించేందుకు
పోరాటం లాంటిదే ఇది నాకు
అసహనపు వెల్లువ నాపై దూకుతున్నా
నిట్టూర్పు సెగలు నన్ను దహిస్తున్నా
అదరక, బెదరక నిలబడుతుంది నా కలం
తగులుతున్న గాయాలే ఈ కలానికి బలం
రక్తపు ధారై సిరా రగులుతూ కారుతుంది
@సురేష్ సారిక

విడివిడిగా ఒక్కటై పోరాడదాం

ప్రపంచం వనుకుతున్నది కరోన దాటికి
ఎదురు నిలవలేన్నన్నది, దాని అత్తరపాటుకి
నేడు భారతావనికంటుకుంది దాని సంతానం
అరికట్టేందుకు నా వంతు కృషి నే చెయ్యాలిగా
ఏ….
వుండలేనా నేను?
నాలుగు రోజులు గడప దాటకుండా
వుండలేనా నేను?
నలుగురికి కూసంత దూరంగా
వుండలేనా నేను?
విందులు లేకుండా, చిందులు తొక్కకుండా
వుండలేనా నేను?
హడావిడి లేకుండా, హద్దులు దాటకుండా
వుండలేనా నేను?
నిజమో కాదో తెలియకపోతే నోరిప్పకుండా
వుండలేనా నేను కొన్నాళ్ళు?
ఎవరి కోసం
నా కోసం, నా వారి కోసం
మానవ జాతి మంచి కోసం
కరోనా రకాసి నిర్మూలన కోసం
మనిషికో అవకాశం ఇది,
మానవత్వం చావలేదని రుజువు చేసేందుకు
తట్టుకోగలదా రాకాసి, నా జాతి తిరగబడితే
విడివిడిగా ఒక్కటై పోరాడదాం
అత్యవసరముంటేనే బయటకొద్దాం
సహకరిద్దాం ప్రతి ఒక్కరితో, శుచిగా వుందాం
మానవాళికి మన మనుగడ దిక్సూచి అయ్యేంతగా
బయపడట్లేదు, జాగ్రత్త పడుతున్నా
బయపెట్టట్లేదు, జాగ్రత్త పడమంటున్నా
@సురేష్ సారిక

ఎప్పుడెప్పుడు ఎంగిలి పడదామా అని ఎదురు చూస్తుంది పెదవి

ఎప్పుడెప్పుడు ఎంగిలి పడదామా అని 
ఎదురు చూస్తుంది పెదవి

మునిపంటి కింద నలుగుతూ 
రమ్మని చొరవగ సైగ చేస్తుంది

తాపపు సెగలోర్పలేక 
పదే పదే తడినద్దుకుంటుంది

ఊహల హద్దులు దాటి 
తమకంతో అదిరి పుడుతుంది


ఆలోచనలకు అలసట కలిగెనో, లేక అనుభూతిని ప్రకటించే తీరిక లేకనో…

ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,
కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది.

ఇంపైన కవితలేమైపోయనో
ఆహాగాణాలినపడకున్నవి.

ఆలోచనలకు అలసట కలిగెనో, లేక
అనుభూతిని ప్రకటించే తీరిక లేకనో…

అస్తమయమిది అని తలచి ఆగనా, లేదా
అంతానికిది సంకేతమని నిష్క్రమించనా…

@సురేష్ సారిక

తన కోపం పాలసంద్రపు ఉప్పెన - Telugu Poetry

తన నవ్వు
తుళ్ళిపడ్డ రత్నాల రాశి
తన నడక
పారుతున్న ముత్యపు ధార
తన సిగ్గు
పూల బారమెక్కువై వంగిన కొమ్మ
తన సొగసు
చినుకు తాకిన చిగురాకు తళుకు
తన మౌనం
అలికిడి లేని కడలి
తన మారం
సవ్వడి చేస్తున్న నింగి
తన కోపం
పాలసంద్రపు ఉప్పెన
తన అరుపు
అగ్ని పర్వతపు తుంపర
@సురేష్ సారిక

రెప్పలేస్తున్న ఆకాశం

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా
ఊహలకందిన నిజం
రెప్పలేస్తున్న ఆకాశం
తారలు
నిండుగ వికసిస్తున్నవి
వడిలి రాలుతున్నవి
మట్టి ముద్దలు
కనిపించని తీగలు పట్టి వేలాడుతున్నవి
పద్దతిగా దారి తప్పక తిరుగుతున్నవి
నాటు వేసినదెవరో
కాపు కాస్తున్నదెవరో
చీకటిలో వెలుగుతున్న అందాలు
చెదురుమదురుగ కనబడుతున్న ఆనందం
వింతగా తోచింది ఓ మూలనున్న చిన్న మట్టి ముద్ద
మనిషనేవాడు నిత్య అన్వేషియై సంచరిస్తున్నాడక్కడ
కాలి కింద లోతెరుగని వాడు
నింగి లోతు కొలిచేందుకు అడుగులేస్తున్నాడు
ఎంతవరకు కొలిచేనో కాలం కుదేలయ్యేలోపు
నిజాన్ని విడిచి
నీడని విశ్లేషిస్తున్నాడు
ఆస్వాదించడం మరిచి అన్నింటిని
ఆవలించి నోట కరుచుకుంటున్నాడు
మురికి మూటలు కట్టుకుంటున్నాడు,
దోచి, దాచుకునేందుకు ఆరాటపడుతున్నాడు
తెలియక, అలసి ఆగే వాడే ప్రతీ వాడు ఓనాడని.
తాను ఎలుతున్నానుకుంటున్నాడు
రేపటికి బందీయై బ్రతుకుతున్నాడు
ఆకలి కమ్ముకున్నది ఓ కంటిని
ఆశల ముసుగంటింది మరో కంటిని
అలసట తీరేందుకు ఓ వినోదం వీడి పోకడ నాకు
మరో కోణం నను కదిలించినప్పుడు
మరింత కధని పొదుపుగ రుచి చూపిస్తా

@సురేష్ సారిక

Sunday, 26 January 2020

మైలపడింది జీవితం నీ ఎడబాటుతో - Telugu Quotes

మైలపడింది జీవితం నీ ఎడబాటుతో
ఆనందం అంటరానిదైనది
ఒంటరి తనమే ఓదార్పైనది
ప్రేమనే పండుగా లేదు,
కొత్తగ బంధు కార్యము లేదు
పొలిమేర దాటకూడని కోరికలట
హద్దుమీరకూడని తీపి భావాలట
పాడుబడ్డ బ్రతుకుని శుభ్రం చేసేదెన్నడో?
మనసుపై వేదన ముసుగుని తీసేదెన్నడో?
కన్నీటి మరకలపై రంగులు అద్దేదెన్నడో?
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life

Saturday, 25 January 2020

మతిమాలిన యువతను మధించాలి నేడు - Telugu Quotes

మతిమాలిన యువతను మధించాలి నేడు
బానిస బ్రతుకు శిక్షణలో పట్టభద్రులు మీరు
కాసుల లక్ష్య చేదనలో నిమగ్నులయ్యారు
కడుపు నిండేందుకు ఎంగిలి మెతుకులు వేరుకుంటున్నారు
నీతి మాలిన జాతి ఉమ్మిన జీవన సరళిలో
కొట్టుకుపోతున్నా గొప్ప నావికులు మీరు
జివ చచ్చిన ప్రాణులు మీరు
పిరికితనపు వారసులు మీరు
ఆత్మ వంచకులు మీరు
ప్రశ్నల రాపిడి లేదే మీలో
రగిలే ఆలోచనలెక్కడ పుట్టెను
మేలుకో
జీవిత యధార్ధమేమిటో తెలుసుకో
నీ విలువ పెంచుకునేలా మసులుకో
దాసోహమవ్వకు దేనికి
క్షణాల సుఖలకై అల్లాడకు
ఓటమి తలచి బయపడకు
వల్లకాదని వెనకడుగు వెయ్యకు
బ్రతుకుంటే చాలనుకోకు
చాలనుకుంటు సర్దుకుపోకు
సత్తువున్నోడివి నువ్వు
సందేహపడకు నీపై నువ్వు
telugu quotes
Telugu Quotes
రెప్ప పాటు కష్టం దాటితే
ఎప్పటికీ నిలిచే చరిత్ర పుడుతుంది
లే..
లేచి
నిలబడు
వొళ్ళు విరుచుకుని తిరగబడు
బలం పుంజుకుని పొరాడు
నీకు నచ్చని నీతో నువ్వు
నిన్ను కన్నోరికి పేరు తెచ్చేలా
నువ్వు కన్నోరికి స్ఫూర్తినిచ్చేలా
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life