Sunday, 22 March 2020

అలరించేందుకు కాదు నా రాతలు

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకు
పెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకు
గద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకు
సామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు
కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకు
చుట్టూ కట్టుకున్న సంకెళ్లను తెంచేందుకు
పోనీలే అనే తత్వాన్ని మాన్పించేదుకు
నేటి సమాజ స్థితికి అద్దం పట్టేందుకు
చీకటి అకృత్యాలను బట్ట బయలు చేసేందుకు
నిర్బంధించిన నిజానికి విముక్తి కలిగించేందుకు
పోరాటం లాంటిదే ఇది నాకు
అసహనపు వెల్లువ నాపై దూకుతున్నా
నిట్టూర్పు సెగలు నన్ను దహిస్తున్నా
అదరక, బెదరక నిలబడుతుంది నా కలం
తగులుతున్న గాయాలే ఈ కలానికి బలం
రక్తపు ధారై సిరా రగులుతూ కారుతుంది
@సురేష్ సారిక

విడివిడిగా ఒక్కటై పోరాడదాం

ప్రపంచం వనుకుతున్నది కరోన దాటికి
ఎదురు నిలవలేన్నన్నది, దాని అత్తరపాటుకి
నేడు భారతావనికంటుకుంది దాని సంతానం
అరికట్టేందుకు నా వంతు కృషి నే చెయ్యాలిగా
ఏ….
వుండలేనా నేను?
నాలుగు రోజులు గడప దాటకుండా
వుండలేనా నేను?
నలుగురికి కూసంత దూరంగా
వుండలేనా నేను?
విందులు లేకుండా, చిందులు తొక్కకుండా
వుండలేనా నేను?
హడావిడి లేకుండా, హద్దులు దాటకుండా
వుండలేనా నేను?
నిజమో కాదో తెలియకపోతే నోరిప్పకుండా
వుండలేనా నేను కొన్నాళ్ళు?
ఎవరి కోసం
నా కోసం, నా వారి కోసం
మానవ జాతి మంచి కోసం
కరోనా రకాసి నిర్మూలన కోసం
మనిషికో అవకాశం ఇది,
మానవత్వం చావలేదని రుజువు చేసేందుకు
తట్టుకోగలదా రాకాసి, నా జాతి తిరగబడితే
విడివిడిగా ఒక్కటై పోరాడదాం
అత్యవసరముంటేనే బయటకొద్దాం
సహకరిద్దాం ప్రతి ఒక్కరితో, శుచిగా వుందాం
మానవాళికి మన మనుగడ దిక్సూచి అయ్యేంతగా
బయపడట్లేదు, జాగ్రత్త పడుతున్నా
బయపెట్టట్లేదు, జాగ్రత్త పడమంటున్నా
@సురేష్ సారిక

ఎప్పుడెప్పుడు ఎంగిలి పడదామా అని ఎదురు చూస్తుంది పెదవి

ఎప్పుడెప్పుడు ఎంగిలి పడదామా అని 
ఎదురు చూస్తుంది పెదవి

మునిపంటి కింద నలుగుతూ 
రమ్మని చొరవగ సైగ చేస్తుంది

తాపపు సెగలోర్పలేక 
పదే పదే తడినద్దుకుంటుంది

ఊహల హద్దులు దాటి 
తమకంతో అదిరి పుడుతుంది


ఆలోచనలకు అలసట కలిగెనో, లేక అనుభూతిని ప్రకటించే తీరిక లేకనో…

ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,
కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది.

ఇంపైన కవితలేమైపోయనో
ఆహాగాణాలినపడకున్నవి.

ఆలోచనలకు అలసట కలిగెనో, లేక
అనుభూతిని ప్రకటించే తీరిక లేకనో…

అస్తమయమిది అని తలచి ఆగనా, లేదా
అంతానికిది సంకేతమని నిష్క్రమించనా…

@సురేష్ సారిక

తన కోపం పాలసంద్రపు ఉప్పెన - Telugu Poetry

తన నవ్వు
తుళ్ళిపడ్డ రత్నాల రాశి
తన నడక
పారుతున్న ముత్యపు ధార
తన సిగ్గు
పూల బారమెక్కువై వంగిన కొమ్మ
తన సొగసు
చినుకు తాకిన చిగురాకు తళుకు
తన మౌనం
అలికిడి లేని కడలి
తన మారం
సవ్వడి చేస్తున్న నింగి
తన కోపం
పాలసంద్రపు ఉప్పెన
తన అరుపు
అగ్ని పర్వతపు తుంపర
@సురేష్ సారిక

రెప్పలేస్తున్న ఆకాశం

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా
ఊహలకందిన నిజం
రెప్పలేస్తున్న ఆకాశం
తారలు
నిండుగ వికసిస్తున్నవి
వడిలి రాలుతున్నవి
మట్టి ముద్దలు
కనిపించని తీగలు పట్టి వేలాడుతున్నవి
పద్దతిగా దారి తప్పక తిరుగుతున్నవి
నాటు వేసినదెవరో
కాపు కాస్తున్నదెవరో
చీకటిలో వెలుగుతున్న అందాలు
చెదురుమదురుగ కనబడుతున్న ఆనందం
వింతగా తోచింది ఓ మూలనున్న చిన్న మట్టి ముద్ద
మనిషనేవాడు నిత్య అన్వేషియై సంచరిస్తున్నాడక్కడ
కాలి కింద లోతెరుగని వాడు
నింగి లోతు కొలిచేందుకు అడుగులేస్తున్నాడు
ఎంతవరకు కొలిచేనో కాలం కుదేలయ్యేలోపు
నిజాన్ని విడిచి
నీడని విశ్లేషిస్తున్నాడు
ఆస్వాదించడం మరిచి అన్నింటిని
ఆవలించి నోట కరుచుకుంటున్నాడు
మురికి మూటలు కట్టుకుంటున్నాడు,
దోచి, దాచుకునేందుకు ఆరాటపడుతున్నాడు
తెలియక, అలసి ఆగే వాడే ప్రతీ వాడు ఓనాడని.
తాను ఎలుతున్నానుకుంటున్నాడు
రేపటికి బందీయై బ్రతుకుతున్నాడు
ఆకలి కమ్ముకున్నది ఓ కంటిని
ఆశల ముసుగంటింది మరో కంటిని
అలసట తీరేందుకు ఓ వినోదం వీడి పోకడ నాకు
మరో కోణం నను కదిలించినప్పుడు
మరింత కధని పొదుపుగ రుచి చూపిస్తా

@సురేష్ సారిక