22, మార్చి 2020, ఆదివారం

రెప్పలేస్తున్న ఆకాశం

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా
ఊహలకందిన నిజం
రెప్పలేస్తున్న ఆకాశం
తారలు
నిండుగ వికసిస్తున్నవి
వడిలి రాలుతున్నవి
మట్టి ముద్దలు
కనిపించని తీగలు పట్టి వేలాడుతున్నవి
పద్దతిగా దారి తప్పక తిరుగుతున్నవి
నాటు వేసినదెవరో
కాపు కాస్తున్నదెవరో
చీకటిలో వెలుగుతున్న అందాలు
చెదురుమదురుగ కనబడుతున్న ఆనందం
వింతగా తోచింది ఓ మూలనున్న చిన్న మట్టి ముద్ద
మనిషనేవాడు నిత్య అన్వేషియై సంచరిస్తున్నాడక్కడ
కాలి కింద లోతెరుగని వాడు
నింగి లోతు కొలిచేందుకు అడుగులేస్తున్నాడు
ఎంతవరకు కొలిచేనో కాలం కుదేలయ్యేలోపు
నిజాన్ని విడిచి
నీడని విశ్లేషిస్తున్నాడు
ఆస్వాదించడం మరిచి అన్నింటిని
ఆవలించి నోట కరుచుకుంటున్నాడు
మురికి మూటలు కట్టుకుంటున్నాడు,
దోచి, దాచుకునేందుకు ఆరాటపడుతున్నాడు
తెలియక, అలసి ఆగే వాడే ప్రతీ వాడు ఓనాడని.
తాను ఎలుతున్నానుకుంటున్నాడు
రేపటికి బందీయై బ్రతుకుతున్నాడు
ఆకలి కమ్ముకున్నది ఓ కంటిని
ఆశల ముసుగంటింది మరో కంటిని
అలసట తీరేందుకు ఓ వినోదం వీడి పోకడ నాకు
మరో కోణం నను కదిలించినప్పుడు
మరింత కధని పొదుపుగ రుచి చూపిస్తా

@సురేష్ సారిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి