Monday, 11 May 2020

ఆకాశాన చుక్కలెట్టి ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకాశాన చుక్కలెట్టి
ముగ్గులెయ్యడం మరిచినదెవరో

ఆకుపచ్చని చెట్టుకి
రంగురంగుల పూలు అంటించనదెవరో

కాలానికి తాడు కట్టి
ఆపకుండా లాగుతున్నదెవరో

నిద్రలో నేనుండగా
ఊహాల లోకంలోకి నన్ను మోసుకెళ్లినదెవరో

ఎవరో ఎవరో
నే నమ్మని వారో
నేనే వారినో

తలచి తలచి తరిగిపోతుంది కాలం
తెలుసుకునేందుకేనేమో ఈ జీవితం

సురేష్ సారిక

Saturday, 9 May 2020

రేపటితో నాకే ఒప్పదం లేదు

ఎప్పుడెప్పుడు ఈ సమాజంతో
సంబంధాలు తెంచుకుందామా
అని ఎదురు చూస్తున్నది మది.
రేపటితో నాకే ఒప్పదం లేదు
భరిస్తూ ఎదురు చూసేందుకు.
బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదు
ఆలోచనపై మోహపు ఛాయా లేదు
ఇంకెందుకు ఇంకా ఇక్కడ
కలుషిత మనుషుల మధ్య
కుళ్లు కంపును తట్టుకుంట్టూ
నచ్చని దారులలో పరుగెందుకు
నాకు నేను నచ్చ చెప్పుకుంటూ
బ్రతుకుతో బేరాలాడుతూ
అంతా బాగు బాగు అనుకుంటూ
కాలంతో కొట్టుకుపోవడమెందుకు
రోజురోజుకి పెరుగుతున్న విరక్తితో
నలుగురిలో సాధువులా సాగేదెందుకు
అన్నిటితో తెగతెంపులు చేసుకొని
నేనిక బంధు బంధ విముక్తుడినవ్వాలి.
ఓ దారి చూసుకుని
నేనిక బయలు దేరాలి
నాకు నేనే మార్గదర్శినై
లోక కళ్యాణ కార్యానికి సిద్ధమవ్వాలి.
స్వస్తి
సురేష్ సారిక

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో...

మురుగు ఆల్చిప్పలో ముత్యమట
మెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట
మచ్చడిన చందమామెంత అందమట
బురద కన్న కమలముకెందుకంత సొగసట
మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమట
గొంగళి పురుగు తోలు వదలగ సీతాకోక చిలుకట
పొగమంచు ముద్ద చల్లగాలికి చినుకై జారి పారునట
ఆకాశానికి అందమైన రంగట, అది మన కంటికి బ్రమట
మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో.
సురేష్ సారిక

Wednesday, 6 May 2020

ఆకు తీసి ఊడ్చే వనితలు వయ్యారాలతో గానాలాడుతూ…

నింగి నుండి రాలిన నీటికి
నేలపై నెరలన్నీ నిండగా

నానిన నేలను రైతు
చదును చేసే వేళ,
నత్తలన్నీ పరుగు పరుగున
తేలే నేలపై, వాటికై హలం వెంట
కొంగల వేట నీటిపై తేలేటి అడుగులతో

విత్తనాల బుట్టను నడుంపట్టి
చల్ల సాగే రైతన్న మురిసిపోతూ

మొలకెత్తె విత్తనాలు వొత్తుగ
పచ్చని ముద్దుబంతి పువ్వుల్లె

ఆకు తీసి ఊడ్చే వనితలు
వయ్యారాలతో గానాలాడుతూ

నిలదొక్కుకున్న పైరు
పరుగు తీసే నిట్ట నిలువుగా

కొంకి పట్టే వరికి మోయలేనంతగా
బరువెక్కువై వరిగె పక్కకు గాలివాటుగా

తెలుసా గట్టు గట్టున చూడ
చోద్యంబు అన్నీ పీత బొక్కలే,
సునాయాసంగా ఒక్కొక్కటి పట్టి
పులిసెట్టి తినిపించె తల్లి కావలికి

కోతకు కేకలెట్టే పొలం, కోసి
పొనలు పొనలుగ తీసి కుప్పేసే రైతు

జల్లు జల్లున రాలే వడ్ల గింజలు
హోయ్ హోయ్ అంటూ రైతు
ఒక్కొక్క వరి కట్ట బండకేసి కొట్టంగ.

చాటేసి ఇసరంగ
చెత్తంత చెదరంగ
బస్తాలు నిండంగ
గుండంత నిండెగా రైతన్నకి
ఊరంత పండగే ఆ రాత్రికి

Suresh Sarika

Other famous Telugu writers poetry Here

Friday, 1 May 2020

తప్పిపోయిన నిద్ర

తప్పిపోయిన నిద్రను
వెతికి తెచ్చుకునేటప్పడికి
అర్ధ రాత్రౌతున్నది.

రోజూ ఇదే తతంగమౌతుందని
తెలవారుతుండంగ కనుజారకుండా
ఆ నిద్రను నా కంటికే
గట్టిగా బిగించి కట్టుకున్నా

గంటలు గడిచే కొద్దీ
నిద్రపై యావ చచ్చి
లేచి నిలుద్దామని చూడగా
చిక్కు ముడి పడ్డట్టుంది
ఎంత గింజుకున్నా
మత్తు వదలనంటుంది

చేసింది ఓ పొరపాటని
అప్పటికి తెలిసొచ్చింది
నిద్రను కట్టాల్సింది
పడుకునే మంచం కోడుకనీ,
నా కంటికి కాదని.

: Suresh Sarika

కడుపు నిండి, కంటికి కూసంత కునుకు పడితే చాలనుకుంటున్నా

గంట గంటకి గొంతు తడుపుతూ
పూట పూటకి కడుపు నింపుతూ
ఆపితే పోతామనుకునే ఊపిరితో
అదుపు లేని గుండె దడలతో

కూసంత చల్లగాలి తగిలితే చలంటూ
గోరంత వేడెక్కువైతే ఉక్కబోతంటూ

ఉక్కిరిబిక్కిరి పడుతూ
రాత్రి పగలు పడిలేస్తూ

దేహానికి సేవలు చేస్తూ
అది కోరిందల్లా తీరుస్తూ

గతాన్ని తలిచి కన్నీరు కారుస్తూ
భవిష్యత్తుపై ఆశతో తడిని తుడుచుకుంటూ

విచ్చలవిడి ఆలోచనలను అదుపు చేసుకుంటూ
అదుపు తప్పకుండా అడుగులకి మద్దతిస్తూ

పద్ధతులంటూ పెద్దలు వేసిన పట్టాలు తప్పకుండా
బంధాలు పట్టుకొచ్చిన బాధ్యతలు తలెనెత్తుకుని
ఆశయాలను పక్కన పెట్టి అవసరాలను తీర్చుకుంటూ
కడుపు నిండి, కంటికి కూసంత కునుకు పడితే చాలనుకుంటూ
అనుక్షణం అదురుతూ బెదురుతూ అడుగులు వేస్తున్నా.

: Suresh Sarika

గత జన్మల పొరపాట్ల ప్రతిఫలము

సృష్టించినోడు
ఉప్పు నీటి సంద్రంలో ఈదులాడమని
పుట్టకతో నుదిటిపై మచ్చ పెట్టినాడో

ఏలేటోడు
చచ్చేదాకా బాధను అనుభవించమని
పగ పట్టి నాకు శాపమిచ్చినాడో

గత జన్మల పొరపాట్లకి ప్రతిఫలము ఇదో
తెలియకేసిన తప్పటడుగులు గమ్యమిదో

@సురేష్ సారిక

గాజు బ్రతుకుల చుట్టూ – గాలి బుడగలంటి కంచెలు

ఎడారి జీవితమే నీది నాది
ఏమున్నది పచ్చగా
మోడుబారిన బ్రతుకులివి

భ్రమ పడి పరిగెడుతున్నాం
ఎండమావి మాయలవి

కన్నీటి మరకలే ఎటు చూసినా
ఆర్తనాదాలే వినోదమాయనా

అల్పమైన ఆనందాలే మన గమ్యాలైనవి
బుద్ధి వైకల్యంతో బ్రతుకులు భారమైనవి

గాజు బ్రతుకుల చుట్టూ
గాలి బుడగలంటి కంచెలు

నూతి లాంటి విశ్వంలో
విహరిస్తున్న స్వేచ్చా జీవులం

రచయిత : సురేష్ సారిక

గుండెకు నిప్పంటుకున్నట్టుంది – Telugu Poetry

గుండెకు నిప్పంటుకున్నట్టుంది
కంటిలో సముద్రం పుట్టుకొచ్చింది

నాలో క్షణానికొకసారి భూకంపం
రెప్పలు దాటి ఉరుకుతుంది
అలలల్లే కన్నీటి హాలాహలం

ఏదో ప్రమాదమని తలచి
ముడుచుకుపోతుంది దేహం

అలసి, సొలసిన నాకు
నిద్రే సేద తీర్చే ఓ తోడు

రచయిత: సురేష్ సారిక

మరో ప్రయాణం – Telugu Poetry

తడిచిన కంటిని తుడుచుకుని
ఆరిన గొంతుని తడుపుకుని

బరువెక్కిన ఊపిరి భారం దింపుకుని
వేడెక్కిన గుండెను చల్లార్చుకుని

తీరం చేరిందన్న బ్రతుకుని
కాలపు అలలకందించా
మరో ప్రయాణం మొదలెట్టమని

అదుపు తప్పక అలలపై ఊయలాడేనో
లేక, తలక్రిందులై మునిగి తేలిపోయేనో

బ్రతుకు
మరో దిక్కున పొద్దు పొడిచేనో..
లేక, నడిమధ్యనే పొద్దుగూకేనో

@సురేష్ సారిక

స్వాగతించకు మహమ్మారి కరోనాని

స్వాగతించకు మహమ్మారి కరోనాని,
నీ చుట్టము కాదది

విష పురగది,
మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది

వాహనమవ్వకు దానికి,
మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి

సంక్రమణను ఆపడమే,
సోకితే విరుగుడు లేదు దానికి

@సురేష్ సారిక

పోరాడదాం రా … కొద్ది రోజులు కదలకుండా!

పోరాడదాం రా
కొద్ది రోజులు కదలకుండా

పోరాడదాం రా
మన జాతిపై కరోన మచ్చ పడకుండా

పోరాడదాం రా
సూచనలను అనుసరిస్తూ

పోరాడదాం రా
సేవకులకి సహకరిస్తూ

పోరాడదాం రా
కరోన పీడ విరగడయ్యే వరకు

@సురేష్ సారిక

నీ నికృష్టపు అత్యాశకు హద్దు ఇది

ఇదేనా మానవ జాతి అభివృద్ధి
విపత్తుని ఎదుర్ఖోలేని మేధాశక్తి
ఇన్నాళ్ల కృషి తెచ్చిచ్చిన ఆస్తి

కాగితాల కోసం చేస్తున్న పరుగులన్ని ఆగిపోయాయి
విర్రవీగిన అధిపత్యపు ఆనవాళ్ళు చెరుగుతున్నాయి
మొక్కినోడికి, మొక్కనోడికి రోజులు చెల్లుతున్నాయి

అనంత విశ్వంలో అడుగు బయట పెట్టలేని గతి నీది
ఎవరేసిన శిక్ష ఇది, నీ నికృష్టపు అత్యాశకు హద్దు ఇది
మితిమీరిన నీ ఆకలికి పస్థులనే బహుమానం ఇది

ఒరుగుతున్నాడు సూర్యుడు
ఆవహిస్తుంది చీకటి

తారతమ్యం తెలియని దేవుడు
ధర్మానికి, అధర్మానికి అదే శిక్ష వేస్తున్నాడు

మరో యుగాదగా ఈ కాలం మిగలనున్నది

మరో ప్రపంచం సరి క్రొత్తగ పుట్టనున్నది
మనిషి కాని మనిషి ఈ నేలను ఏలనున్నాడు

by : సురేష్ సారిక