27, అక్టోబర్ 2020, మంగళవారం

నా కన్ను ఏమి చెయ్యలేక రెప్పలు కప్పుకుంటుంది - సురేష్ సారిక

 నా కన్ను చూస్తుంది.

రెక్కలాడించి ఆడించి 

డొక్కలెండిన పేదవాడిని

బక్క పీనుగై పడి బాటపై 

తిరుగాడుతున్న వాడిని


నా కన్ను చూస్తుంది.

పోరాడే ఓపిక లేనోడిని పీక్కుతింటున్న వాడిని

తిని బలిసి తిన్నదరిగే వరకు తింటున్న వాడిని

అది చూసి పట్టలేక మొరుగుతున్న వాడిని

చూసి చూడక పక్కకు జరుగుతున్న వాడిని


నా కన్ను చూస్తుంది.

తప్పు చేసి తప్పించుకునే వాడిని

తను చేసిందేది తప్పు కాదను వాడిని


నా కన్ను చూస్తుంది.

చూసి తడుస్తుంది.

ఏమి చెయ్యలేక

రెప్పలు కప్పుకుంటుంది.


సురేష్ సారిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి